పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

ఐదేండ్లపాటు నిషేధం

unlawful-association-central-government-bans-radical-outfit-pfi-for-5-year

న్యూఢిల్లీః పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియాపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మంగళవారం మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​(ఈడీ) మంగళవారం సంయుక్త ఆపరేషన్​ చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి. 7 రాష్ట్రాల్లో PFI సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్లు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.అంతకుముందు ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ మేరకు రిమాండ్ రిపోర్టును రూపొందించింది.

స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఓ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుల పేర్లు ఉన్నట్లు తెలిపింది. నేతల ఆదేశాలతో పని చేస్తున్న పీఎఫ్​ఐ సభ్యులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో యువతను తప్పుదోవపట్టించిందని వివరించింది. యువతను లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పీఎఫ్ఐ ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ తెలిపింది. ఇందులో భాగంగా ఈ సంస్థ.. భారతదేశంలో ఇస్లామిక్​ పాలనను స్థాపించడానికి కుట్ర పన్నిందని నివేదికలో వెల్లడించింది. మరోవైపు, ఈ సంస్థపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్.. కేంద్రాన్ని కోరింది. పీఎఫ్ఐకి సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సూచించింది.సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది. కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు (10), అసోం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4) , పుదుచ్చేరి, దిల్లీ (3) రాజస్థాన్ (2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/