ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేం: స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న వేళ.. కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు.

ధాన్యం సేకరణకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయ‌ని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ స్ప‌ష్టం చేసింది. క‌నీస మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్‌లో ఉన్న ధరలు, ఇతర పరిస్థితుల‌ ఆధారంగానే సేకరణ జరుగుతుందని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎఫ్‌సీఐ.. గోధుమ, వరి ధాన్యాలను నిర్దిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో కనీస మద్దతు ధరకు ముడి ధాన్యం సేకరణ జరుగుతుందని కేంద్రం పేర్కొంది. ఎఫ్‌సీఐతో చర్చించి ప్రణాళిక ప్ర‌కారం ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్ప‌ష్టం చేసింది. సేకరించిన ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రాలకు తిరిగి పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/