పోలవరం..సిఎం జగన్‌పై ఉండవల్లి విమర్శలు

కేంద్రంపై జగన్ కేసు ఎందుకు వేయడం లేదు

Vundavalli Arun Kumar

రాజమండ్రి: మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ రాజమండ్రిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టు పై మాట్లాడుతూ..సిఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటుందని తాను ముందే భావించానని చెప్పారు. టిడిపి హయాంలో పాదయాత్ర సందర్భంగా పోలవరంను జగన్ పదేపదే విమర్శించారని… ఇప్పుడు దాని ప్రభావం పడిందని అన్నారు. పోలవరంపై కేంద్రం మాటమార్చినప్పుడు ఒక కౌంటర్ దాఖలు చేస్తే సరిపోయేదని చెప్పారు. కేంద్రంపై కేసు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.

ఇప్పటికీ అన్నిటికీ టిడిపి అధినేత చంద్రబాబే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారని… జనాలు మీకు 151 సీట్లను ఇచ్చింది చంద్రబాబును విమర్శించడానికి కాదని ఉండవల్లి అన్నారు. ఎన్నికల ముందు రాజమండ్రి ప్రచారసభలో ప్రధాని మోడి మాట్లాడుతూ, చంద్రబాబుకు పోలవరం ఏటీఎంలా మారిందని చెప్పారని… ఆ తర్వాత అప్పటి జలశక్తి మంత్రి కటారియా పార్లమెంటులో మాట్లాడుతూ పోలవరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటించారని చెప్పారు. మోడి మాటలకు, కేంద్ర మంత్రి ప్రకటనకు పొంతనే లేదని దుయ్యబట్టారు.

పోలవరం పరిస్థితి చివరకు ఇలా అవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం బాధితులకు పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయకుండా ప్రాజెక్టును నిర్మించడం అసాధ్యమని చెప్పారు. జగన్ ప్రభుత్వం పోలవరం బాధ్యతల నుంచి తప్పుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేని స్థితిలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఉందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విభజన చట్టంలోనే ఉందని… దీని గురించి మోడి కాలర్ పట్టుకోవాల్సిన అవసరం లేదని, కేవలం కోర్టులో కేసు వేస్తే సరిపోతుందని చెప్పారు. ఈ పని కూడా జగన్ చేయలేకపోతున్నారని విమర్శించారు.
కాగా ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కేంద్రం భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/