వయసుకు మించిన సాహసాలొద్దు

నీతి కథ

driving
driving

వంశీ చిన్ననాటి నుంచే వయసుకు మించిన తెలివితేటలు గలవాడు. అతని తల్లిదండ్రులు అతనికి చిన్న వయసు నుంచే శ్లోకాలు, భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు నేర్పారు. పురాణ, నీతి కథలను అసంఖ్యాకంగా చెప్పారు. లలిత కళలను నేర్పారు. జనరల్‌ నాలెడ్జ్‌ నేర్పారు. గణితంలో వయసుకు మించిన తెలివితేటలు సాధించాడు వంశీ. ఇలా చిన్న వయసులోనే పెద్ద మేథావి అయ్యాడు వంశీ. వంశీ 6వ తరగతికి వచ్చాడు. ఆ వయసులోనే అతడు 10వ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి అయిన శ్రీశతో స్నేహం చేశాడు. ఆయా విషయాలలో కఠినమైనవి వంశీ శ్రీశ చేత చెప్పించుకునేవాడు. వంశీ తండ్రి మహేంద్ర శ్రీశతో తన కొడుకు గురించి గొప్పలు చెప్పుకొనేవాడు. తన కొడుకు భవిష్యత్తులో ఈ దేశాన్నే పరిపాలిస్తాడని చెప్పేవాడు. ‘మీ కోరిక నెరవేరాలని కోరుకునేవారిలో నేను ముందు ఉంటానండీ! అన్నాడు శ్రీశ. ఒకరోజు శ్రీశ పనిమీద వంశీ ఇంటికి వెళ్లాడు. అక్కడ మహేంద్ర తన కొడుకుకు బైక్‌ డ్రైవింగ్‌ నేర్పిస్తున్నాడు. శ్రీశను చూసి మహేంద్ర ఇలా అన్నాడు ‘మా అబ్బాయి 6వ తరగతికే మోటార్‌ సైకిల్‌ చక్కగా నడిపేలా చేస్తున్నాను. 7వ తరగతికి వచ్చాక కారు బాగా నడుపుతాడు చూడు అని. అప్పుడు శ్రీశ ‘అయ్యో అంకుల్‌! చిన్న వయసులో డ్రైవింగ్‌ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. మీ అబ్బాయికి ప్రాణాలకే ముప్పు వస్తుంది. అసలే వంశీ ఉజ్వల భవిష్యత్తు గలవాడు ఆలోచించండి అన్నాడు. మహేంద్రకు కోపం వచ్చింది. ‘నీకు మా వంశీపైన మొదటి నుంచి అసూయ. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్ఞ. ఇంకెప్పుడూ మా అబ్బాయితో నువ్ఞ్వ మాట్లాడవద్దు, వెళ్లు ఇక్కడి నుండి అని గద్దించాడు. శ్రీశ గురించి వంశీకి చెడుగా చెప్పాడు. రోజులు గడిచాయి.
ఒకరోజు వంశీ బైక్‌ అతివేగంగా నడుపుతుండగా హఠాత్తుగా కుక్క అడ్డం వచ్చింది. వంశీ సడెన్‌ బ్రేక్‌ వేసి కింద పడిపోయాడు. తలకు తీవ్రగాయాలయ్యాయి. వంశీ మతిస్థిమితం కోల్పోయాడు. వాళ్ల అమ్మానాన్నల దుఃఖానికి అంతులేదు. పిల్లల తెలివితేటలను బట్టి తల్లిదండ్రులకు ఆశలు ఉండటం సహజమే. కానీ అత్యాశతో వారితో వయసుకు మించిన సాహసాలను చేయించవద్దు. కాబట్టి పిల్లలూ! 18 సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్‌ నేర్చుకోండి. అది మీకు క్షేమాన్ని కలుగజేయడం మాత్రమే కాదు ఇతరుల ప్రాణాలను కాపాడగల్గుతారు.

— సరికొండ
శ్రీనివాసరాజు
వనస్థలిపురం

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/