లసిత్‌ మలింగ మళ్లీ ముంబయి జట్టులోకి…

Lasith Malinga
Lasith Malinga

కొలంబో: ముంబై ఇండియన్స్‌కు ఊరటనిచ్చే వార్త. శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ మళ్లీ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. ప్రపంచకప్‌ సెలక్షన్‌ కోసం ఈనెల 30 నుంచి జరిగే దేశవాళీ ప్రొవెన్షియన్‌ వన్డే టోర్నీలో తప్పనిసరిగా ఆడాలని లంక బోర్డు నిబంధన విధించడంతో…మలింగ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, వేలం సమయంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి…ఇప్పుడు ఇలాంటి షరతులు పెట్టడమేంటని లంక బోర్డుపై బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈమేరకు లంక క్రికెట్‌ బోర్డుకు ఫోన్‌ చేసిన బిసిసిఐ…మలింగా విషయంలో స్పష్టత కోరినట్లు తెలిసింది. దాంతో చేసేదిలేక మలింగాకు ఎస్‌ఎల్‌సి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఐపిఎల్‌లో మలింగా ఆడటానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఇప్పటికే అతనికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేశాం. అతను స్వేచ్ఛగా ఐపిఎల్‌ ఆడవచ్చు. వన్డేల్లో అతను మాకు ప్రధాన బౌలర్‌. అతనికి జట్టులో చోటు కల్పించే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఐపిఎల్‌ ఆడినా…ప్రపంచకప్‌కు వెళ్లే మా జట్టులో మలింగా స్థానంపై ఢోకా ఉండదని ఎస్‌ఎల్‌సి చీఫ్‌ సెలక్టర్‌ ఆశంతా డిమెల్‌ పేర్కొన్నట్లు సమాచారం.


మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/