కరోనాపై కొరవడుతున్న అవగాహన

మాస్క్‌లు,భౌతిక దూరం తప్పనిసరి

awareness on the corona
awareness on the corona

కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడాలంటే ప్రస్తుతానికి భౌతికదూరం పాటించడం, మాస్క్‌ తప్పని సరిగా ధరించడం ద్వారా మాత్రమే సాధ్యమని అందరికీ తెలుసు.

అయితే మాస్క్‌ వాడటం చాలా ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి.

మాస్కులు ధరించని వారు అపరాధరుసుం చెల్లించేలా ప్రభుత్వా లు చర్యలు తీసుకుంటున్నాయి. అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోందన్న భయం వల్ల కొందరు, ఆరోగ్యం మీద జాగ్రత్తతో కొందరు దాదాపుగా ప్రతి ఒక్కరూ మాస్క్‌ వాడటం అలవాటు చేసుకుంటున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి నిర్దిష్ట మైన జాగ్రత్తలతో మాస్కు ధరించాలని వైద్యసంస్థలు చెబుతు న్నాయి. అయినప్పటికీ శాస్త్రీయ పద్ధతిలో మాస్క్‌లు వాడుతున్న వారు పది శాతంలోపే ఉన్నారని ఇటీవలి కాలంలో వైద్య, ఆరోగ్య శాఖ జరిపిన ఓ పరిశీలనలో తేలింది.

క్షేత్రస్థాయిలో ప్రజలుమాస్క్‌లు ధరిస్తున్న తీరుపై వైద్య, ఆరోగ్యశాఖ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గత జులై నెలలో ఇరవై రోజుల పాటు ఇరవై వేల మందిని పరిశీలించగా ఇందులో తొంభైశాతం మంది నిబంధనలు పాటించట్లేదని తేలింది.

చాలామంది ముక్కును వదిలేస్తూ, నోరు కవరయ్యేలా మాస్కు ధరిస్తున్నారు. ఇంకొందరు పేరుకు మాస్క్‌ ధరించినా దాన్ని గడ్డం కిందకు లాగేస్తున్నారు.

ఈ పరిశీలనలో ఇరవైవేల మందిలో తొంభైశాతం మంది ఇదే తరహాలో మాస్కు పెట్టుకుంటున్నారని తేలింది. ఇందులో అరవైఐదు శాతం మంది మాస్కు భాగాన్ని తరచూ తాకుతున్నారని తేలింది.

వైరస్‌ సోకిన వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఆ వైరస్‌ ధరించిన మాస్క్‌ ముందు భాగానికి చేరుతుంది.

ఈ క్రమంలో మాస్క్‌ ముందుభాగాన్ని తాకినా, తిరిగి అదే చేతితో ముక్కు, నోటి భాగాన్ని తాకినా వైరస్‌ శరీరంలోనికి చేరుతుంది.

ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో జాగ్రత్తలు పాటించని వాళ్లేఎనభై అయిదు శాతం ఉన్నట్లు వైద్యశాఖ పరిశీలన చెబుతోంది.

అదేవిధంగా కరోనా బాధితుల్లో అత్యధిక మంది రద్దీ ప్రాంతాల్లో తిరిగి వైరస్‌ బారిన పడినవారేనని ఈ విశ్లేషణలో తేలింది.

ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ నుంచి రక్షించే ప్రధాన ఆయుధం ఫేస్‌మాస్క్‌. దీన్ని శాస్త్రీ య పద్ధతిలో ధరించి జాగ్రత్తలు పాటిస్తే దాదాపు సురక్షితంగా ఉండవచ్చు.

బయటకు వెళ్లేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ట్రిపుల్‌ లేయర్‌ మాస్కును ముక్కు,నోరు పూర్తిగా కవరయ్యేలా ధరించాలి.

ఒకసారి మాస్క్‌ పెట్టుకున్నాక ముందువైపు తాకొద్దు. మాస్క్‌ను చెవివైపు నాడాలను పట్టుకుని తొలగించి నేరుగా వేడి నీటిలోవేసి ఉతికేయాలి.

సబ్బు లేదా ఇతర డిటర్జెంట్‌ పౌడర్‌తో ఉతికి, నాలుగు గంటలపాటు అరబెట్టాక వినియోగించాలి అని వైద్యనిపుణులు చెబుతున్నారు.

కానీ నూటికి తొంభైశాతం మంది ఈ ముఖ్యమైన విషయాన్ని అసలు పాటించడం లేదని తెలు స్తోంది. అందుకే మాస్కును వాడటంకాదు, దాన్ని ఎలా వాడు తున్నామన్నదే ముఖ్యమని ప్రజలు గ్రహించాలి.

మాస్క్‌ను వాడు తూ కూడా పదేపదే చేతిని ముఖానికి తగిలించుకోవడం ముక్కు వద్ద పట్టుకుని మాస్కుని పైకి లాగడం చేయడం వల్ల మాస్క్‌ కరోనా వైరస్‌ నుంచి కాపాడలేదని గ్రహించాలి.

మాస్కులు ధరిం చడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే మన వల్ల ఇతరులకు ముప్పు ఉండదు.

ప్రస్తుతం మాస్కులు ధరించడం గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచనల ప్రకారం ప్రజలు మెడికల్‌,క్లాత్‌ మాస్కుల్లో ఏదైనా సరే ఉపయోగించవచ్చు.

అయితే మెడికల్‌ మాస్కులు కేవలం హెల్త్‌ వర్కర్లు, కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నవారు మాత్రమే వాడాలని తెలిపింది.

క్లాత్‌తో తయారు చేసే మాస్కులను కరోనా లక్షణాలు లేనివారు వాడాలని పేర్కొంది.

మెడికల్‌ మాస్కులు ఒక్కసారి మాత్రమే ఉపయోగించి పాడేయా లని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

అయితే క్లాత్‌ మాస్కులు ఎన్నిసార్లయినా వాడవచ్చని, ఒకసారి వాడిన తర్వాత మరిగిన నీటిలో వేసి ఉతకాలి.

ఆ తర్వాతే దాన్ని వాడాలి. వాడే మాస్కు ఎలా ఉండాలి?మాస్క్‌ వినియోగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?తదితర అంశాలను గురించి ప్రజలు తప్పనిస రిగా తెలుసుకోవాలి.

రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు తప్పకుండా మెడికల్‌ లేదా, క్లాత్‌ మాస్కులు ధరించాలి.

రెండు మీటర్లు కంటే ఎక్కువదూరం పాటించడం కష్టంగా ఉండే ప్రాంతాల్లో తప్పకుండా మెడికల్‌ మాస్కులు ధరించాలి.

హాస్పిటళ్లకు వెళ్లినప్పుడు తప్ప కుండా మెడికల్‌ మాస్క్‌ను ధరించాలి. బయటకు వచ్చిన తర్వాత దాన్నిపడేయాలి.

మెడికల్‌ మాస్కులను సర్జికల్‌ మాస్కులని కూడా అంటారు. మీ ఇంట్లో ఎవరైనా కరోనా అను మానితులు ఉంటే మెడికల్‌ మాస్కులువాడాలి.

ఇంట్లో 60ఏళ్లకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దవాళ్లు ఉన్నట్లయితే వారికి మెడికల్‌ మాస్కులు ఇవ్వాలి.

ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి కూడా మెడికల్‌ మాస్కులు ఇవ్వాలి. వీటిని ఒకసారి మాత్రమే వాడాలి.

ఇంట్లో క్లాత్‌తో తయారుచేసుకునే మాస్కును కనీసం నాలుగు లేదా ఐదుపొరలుండాలి.అప్పుడే వైరస్‌ ప్రవేశించడం కష్టమవుతుంది. కొవిడ్‌-19లక్షణాలు లేనివారు ఈ ఫ్యాబ్రిక్‌ మాస్కులు పెట్టు కోవాలి.

కేవలం ఒక మీటరు దూరం పాటించే ప్రాంతాల్లో ఈ మాస్కులు సురక్షితం కాదు. వీటికి బదులు మెడికల్‌ మాస్కులు పెట్టుకోవాలి.

రైళ్లు, ట్యాక్సీలు, బస్సుల్లో ప్రయాణించేవారు ఈ మాస్కులు ధరించవచ్చు.

అయితే ఇతరులతో భౌతికదూరం పాటి స్తేనే ఉపయోగం.

సింగిల్‌ క్లాత్‌ ఒక పొరతో కాకుండా నాలుగు లేదా ఐదు పొరలు ఉన్నక్లాత్‌ మాస్కులనే కొనుగోలు చేయాలి.

  • ఆత్మకూరు భారతి

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/