ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు మరణ శిక్ష

Sheikh
Sheikh

ఢాకా : 1988లో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న షేక్‌హసీనా వాహనంపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హసీనా నాయకత్వంలో సాగిన ర్యాలీలో పోలీసులు కాల్పులు జరపడంతో హసీనా మద్దతుదారులు 24 మంది మృతి చెందారు. డిఫెన్స్ వాదన పూర్తయిన తరువాత ఈ తీర్పు వెలువడింది. కోర్టు మొత్తం 53 మంది సాక్షులను విచారించింది. శిక్షపడిన దోషులు ఐదుగురిలో నలుగురు మొస్తాఫిజుర్ రెహ్మాన్, ప్రదీప్ బారుయా, షా మహమ్మద్ అబ్దుల్లా, మంతాజ్ ఉద్దీన్ . ఐదో వ్యక్తి గోవింద చంద్ర మొండల్ పరారీలో ఉన్నాడు. సైనిక నియంత హెచ్‌ఎం ఎర్షాద్ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు చిట్టగాంగ్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించడానికి హసీనా వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మాజీ ప్రధాని ఖలేదా జియా అధికారం లోకి వచ్చిన తరువాత 1992 మార్చి 5న ఈ కేసు దాఖలైంది. అయినా ఎలాంటి చర్య తీసుకోలేదు. 1996 లో జియా పాలన ముగిసి హసీనా అధికారం లోకి రాగానే దర్యాప్తు ప్రారంభమైంది.

తాజా వీడియోస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/