మరియుపోల్‌లో థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం.. అందులో 1200 మంది పౌరులు

యుద్ధాన్ని భీకరంగా మారుస్తున్న రష్యా

Ukraine war: Russia attacks theatre sheltering civilians, Mariupol

మారియుపోల్ : ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని రష్యా మరింత భీకరంగా మారుస్తోంది. మరియుపోల్‌లో 1200 మంది వరకు తలదాచుకున్న ఓ థియేటర్‌పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో థియేటర్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణనష్టం భారీగానే ఉంటుందని చెబుతున్నప్పటికీ ఎంతమంది చనిపోయి ఉంటారన్న విషయం స్పష్టంగా తెలియరావడం లేదు. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే థియేటర్‌పై దాడికి పాల్పడ్డాయని మరియుపోల్ అధికారులు ఆరోపించారు.

నిరాయుధులైన మహిళలు, చిన్నారులు సహా ఎవరినీ వదిలిపెట్టడం లేదని ఆరోపించారు. రష్యా దళాలు ఈ నగరాన్ని చుట్టుముట్టడంతో దాదాపు 3 లక్షల మంది చిక్కుకుపోయారని నీరు, విద్యుత్, గ్యాస్, ఆహారం, ఔషధాల కొరత వేధిస్తోందని వాపోయారు. నగరంలోని ఓ ఆసుపత్రిని స్వాధీనం చేసుకున్నసేనలు దాదాపు 400 మందిని ఇళ్ల నుంచి తీసుకెళ్లి ఆసుపత్రిలో నిర్బంధించినట్టు తెలుస్తోంది. అలాగే, వందమంది వైద్యులు, రోగులను కూడా నిర్బంధంలోకి తీసుకున్నట్టు సమాచారం. వారందరినీ రష్యా దళాలు మానవ కవచాలుగా వాడుకుంటున్నాయని, ఎవరినీ బయటకు రానీయడం లేదని చెబుతున్నారు. మరోవైపు, రాజధాని కీవ్‌లోనూ రష్యా సేనలు చెలరేగిపోతున్నాయి. వార్తల సేకరణకు వెళ్లిన ఫాక్స్‌న్యూస్ జర్నలిస్టుల వాహనంపై జరిగిన బాంబు దాడిలో ఇద్దరు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 12 అంతస్తుల భవనంపైనా బాంబు దాడి జరిగింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/