పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడాలి..భారత్ సహాయం కోరిన ఉక్రెయిన్‌

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌ జోక్యం చేసుకోవాలని ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా కోరారు. ఉక్రెయిపై దాడిని రష్యా ప్రారంభించిన నేపథ్యంలో గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఈ యుద్ధాన్ని ఆపడంలో భారత నాయకత్వం క్రియాశీల మద్దతు కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడీ మాట్లాడాలని కోరారు. ప్రపంచ నాయకుల్లో ఎవరి మాట పుతిన్‌ వింటారో తనకు తెలియదన్నారు. అయితే ప్రధాని మోడీ బలమైన గొంతు తమకు ఆశాజనకంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో పుతిన్‌తో చర్చలు జరుపడంపై భారత ప్రభుత్వ అనుకూల వైఖరిని తాము ఆశిస్తున్నామన్నారు.

ప్రస్తుత తరుణంలో భారత దేశం తమకు మద్దతు ఇవ్వాలని వేడుకుంటున్నామని ఉక్రెయిన్‌ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా అభ్యర్థించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుతున్న నిరంకుశ రష్యా దురాక్రమణపై భారతదేశం తన ప్రపంచ పాత్రను పోషించాలని ఆయన కోరారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, గౌరవనీయమైన నాయకులలో మోడీ జీ ఒకరని కొనియాడారు. దీంతో పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడగలరని తాము భావిస్తున్నట్లు డాక్టర్ ఇగోర్ పోలిఖా చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో కూడా ప్రధాని మోడీ మాట్లాడాలని కోరారు. చరిత్రలో చాలా సార్లు శాంతి పరిరక్షక పాత్రను భారత్‌ పోషించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపడానికి బలమైన భారత్‌ గొంతును తాము కోరుతున్నామని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/