రిషి సునాక్ కేబినెట్ లో తప్పని రాజీనామాల తిప్పలు

మంత్రి పదవికి రాజీనామా చేసిన గవిన్

UK Prime Minister Rishi Sunak under pressure as minister resigns amid bullying row

లండన్ః బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రుల రాజీనామాలు పరిపాటిగా మారాయి. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్ నుంచి మొదలైన మంత్రుల రాజీనామాలు… మొన్నటి లిజ్ ట్రజ్ కేబినెట్ లోనూ కొనసాగాయి. ఆ తరహా ముప్పేమీ తనకు ఉండబోదన్న భావన కలిగించిన రిషి సునాక్ కేబినెట్ లోనూ రాజీనామాల పర్వం మొదలైపోయింది. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ పదవీ బాధ్యతలు చేపట్టిన 2 వారాల్లోనే ఆయన కేబినెట్ లోని ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.

సాటి ఎంపీని బెదిరించారన్న ఆరోపణలతో రిషి సునాక్ కేబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా పనిచేస్తున్న గవిన్ విలియమ్సన్ మంగళవారం రాత్రి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా తనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని కూడా ఆయన ఒప్పుకున్నారు. ఇక తనపై జరిగే విచారణకు కూడా సహకరిస్తానని గవిన్ వెల్లడించారు. సాటి ఎంపీని బెదిరిస్తూ టెక్ట్స్ మెసేజ్ పంపారంటూ ఓ మీడియా సంస్థ గవిన్ పై ఇటీవల ఓ కథనాన్ని రాసింది. ఈ కథనంపై చర్చ జరుగుతుండగానే.. ఓ సివిల్ సర్వెంట్ కూడా గవిన్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన కార్యాలయ సిబ్బందిపైనా గవిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవారని, కిటికీల్లో నుంచి దూకి చావండి అంటూ బెదిరించేవారని ఆ సివిల్ సర్వెంట్ చెప్పుకొచ్చారు.

ఇక తనపై వరుసగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గవిన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతున్న బ్రిటన్ ను ఆ ముప్పు నుంచి బయటపడేసే దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రిషి సునాక్ కేబినెట్ కు ఏమాత్రం చెడ్డ పేరు రాకూడదన్న భావనతోనే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గవిన్ తెలిపారు. తన వల్ల రిషి సునాక్ కేబినెట్ కు చెడ్డ పేరు రాదన్న భావనతోనే రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/