60 దేశాలకు విస్తరించిన బ్రిటన్‌ కరోనా..డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: బ్రిటన్‌ కరోనా భారత్, అమెరికాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను చుట్టేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కొవిడ్ పై బుధవారం విడుదల చేసిన తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. గత వారంలోనే 10 దేశాలకు అది వ్యాపించిందని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. దక్షిణాఫ్రికా రకం కరోనా 23 దేశాలకు పాకిందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వారంలో 47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 6 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే, మరణాలు మాత్రం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. రికార్డ్ స్థాయిలో ఒక్క వారంలోనే 93 వేల మంది కరోనాకు బలయ్యారని, అంతకుముందు వారంతో పోలిస్తే అది 9 శాతం అధికమని పేర్కొంది. మొత్తంగా ప్రపంచమంతటా 9.3 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 20 లక్షల మందికి పైగా మరణించారని పేర్కొంది.

స్కూళ్లు తెరవాలనుకుంటే కరోనా కేసులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని సూచించింది. సామూహిక వ్యాప్తి ఉన్న చోట కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని, అలాంటి చోట విద్యార్థులు, సిబ్బందికి మహమ్మారి సోకకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై చర్చించాలని చెప్పింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/