నేటి రాత్రి ఒంటి గంట నుండి శ్రీవారి ఆలయంలో ‘ఉగాది ఆస్థానం’

Tirumala
Tirumala

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట నుండి ఉగాది పండుగను వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తుంది. ఉగాది నుంచే తిరుమలేశుని ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఒంటి గంటకు శ్రీవారి సుప్రభాత సేవతో ఉగాది మొదలుకానుంది. శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని వేంచేపు చేసి దక్షిణాభిముఖంగా సేనాధిపతిని కొలువుదీర్చి ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదపద్మాల మీదనున్న శ్రీవికారినామ సంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి స్వీకరించి.. శ్రీవారికి నూతన పంచాంగ విశేషాలు వినిపించనున్నారు. ప్రత్యేకంగా శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఫలితాలు విన్నవిస్తారు. శ్రీదేవి, భూదేవులకు కూడా నక్షత్ర ఫలాలు నివేదిస్తారు. శనివారం సాయంత్రం చతుర్మాడ వీధుల్లో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీమలయప్పస్వామి బంగారు పల్లకిపై ఊరేగుతూ నూతన సంవత్సర శుభాశీస్సులతో పాటు దివ్యమంగళ దర్శనంతో భక్తకోటికి అనుగ్రహించనున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/