సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు గంట గంటకు మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభంపై శివ‌సేన అధినేత‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక‌రే బుధ‌వారం సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. వాటి కోసం పోరాటం చేయబోనని తేల్చి చెప్పారు. ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా రాజీనామా చేస్తానని వెల్లడించారు.

శివసేన ఎప్పుడూ హిందుత్వాన్ని వదిలిపెట్టలేదని అన్నారు ఠాక్రే. హిందుత్వం తమ గుర్తింపు అని చెప్పారు. ఈ సందర్భంగా ఏక్​నాథ్​కు పరోక్షంగా చురకలు అంటించారు ఠాక్రే. కొందరు ప్రేమతో గెలుస్తారు, ఇంకొందరు కుట్రలతో గెలుస్తారని వ్యాఖ్యానించారు. సీఎం ప‌ద‌వికి తాను స‌రిపోన‌ని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తే ప‌ద‌వి నుంచి దిగిపోయేందుకు తాను సిద్ధ‌మేన‌ని కూడా ప్ర‌క‌టించారు. సీఎం ప‌ద‌వికి రాజీనామా లేఖ‌ను త‌న వ‌ద్దే సిద్ధంగా ఉంచుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. నా అనుకున్న వాళ్లే తనను మోసం చేశారని ఆయన వాపోయారు. కోవిడ్ ప్రభావంతో తన గొంతు వణుకుతోందన్నారు.

ఏక్‌నాథ్ షిండేను తమ నాయకుడిగా పేర్కొంటూ 30 మంది శివసేన ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాసిన అర గంట తర్వాత ఉద్దవ్ థాక్రే ప్రసంగాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలనలో ఉన్న అసోం రాజధాని గువహటిలోని ఓ హోటల్‌లో ఉన్నారు.