సీఏఏ కారణంగా ఎవరూ ఆందోళన చెందవద్దు
అణచివేతకు గురైన మైనార్టీలకు మాత్రమే ప్రయోజనం

ముంబయి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్నార్సీ)లపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. వాటి కారణంగా ఎవరినీ దేశం నుంచి బయటకు పంపబోరని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఉద్ధవ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకాబోదని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. మహారాష్ట్ర అవసరాలను మోడీకి వివరించాను. మహారాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ గురించి మేం చర్చించాం. సీఏఏపై నా వైఖరి స్పష్టం చేశాను. సీఏఏ కారణంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అణచివేతకు గురైన మైనార్టీలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నార్సీ అమలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి సమస్యాలేదు. ఒకవేళ సీఏఏ, ఎన్నార్సీ కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. అప్పుడు మేం కచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తాం అని భేటీ అనంతరం ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/