రెండేళ్లవరకు గృహ నిర్భందంలో ఫరూక్‌ అబ్దుల్లా…

farooq abdullah
farooq abdullah

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి తొలగించినప్పటీ నుంచి కాశ్మీర్‌లోయలో అప్రకటిత ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ నేతలను గృహ నిర్భందంలో ఉంచిన భద్రతా బలగాలు… నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపకుడు, మాజీ జమ్మూ కాశ్మీర్‌ సిఎం ఫరూక్‌ అబ్దుల్లాపై మరో అస్త్రం ప్రయోగించారు. ప్రజాభద్రతా చట్టం కింద హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు ఆయన ఇల్లే జైలని…బంధువులు…స్నేహితులను కూడా కలవొద్దని కొత్తగా ఆంక్షలు విధించారు. జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ కొత్త చర్యపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వర్గాలు భగ్గుమంటున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు అక్కడి గవర్నర్‌ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మాజీ సిఎంలు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబ ముఫ్తిని గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూ కాశ్మీర్‌ ప్రజా భద్రతా చట్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఫరూక్‌ అబ్దుల్లాపై ఈచట్టాన్ని ప్రయోగించారు. దీంతో ఫరూక్‌ అబ్దుల్లా నిర్బంధం మరింత కఠినతరం కానుంది. అయితే జమ్మూకాశ్మీర్‌ ప్రజాభద్రత చట్టం కింద ఒక వ్యక్తి రెండేళ్ల వరకు ఎలాంటి విచారణ జరపకుండా నిర్భందించే వెసులుబాటు ఉన్నది. చట్టంలో ఉన్న ఆ వెసులుబాటును ఆసరాగా చేసుకొని…ఫరూక్‌ అబ్దుల్లాపై ప్రయోగించింది. ఆదివారం రాత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై జమ్మూకాశ్మీర్‌ ప్రజా భద్రతా చట్టం ప్రయోగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/