రాముడు, సీత విగ్రహాల కోసం అయోధ్యకు చేరుకున్నసాలిగ్రామ శిలలు

అయోధ్యః ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ గుడిలో ప్రతిష్టించనున్న రాముడి విగ్రహం కోసం కావాల్సిన సాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. నేపాల్‌లోని గండకీ నది సమీపంలో లభించే ఆ బండరాళ్లను విష్ణు ఆరాధకులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక రామజన్మభూమిలో నిర్మిస్తున్న ఆలయంలో.. ఆ శిలలతో చేసిన రాముడు, జానకీ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. పవిత్ర శిలలు అయోధ్యకు చేరుకోవడంతో పూజారులు, స్థానికులు ఆ బండరాళ్లకు పూజలు చేశారు. సాలగ్రామ శిలలకు పూజలు చేసిన తర్వాత వాటిని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు.
కొత్త ఆలయంలో ఈ సాలగ్రామ రాళ్ల నుంచి రూపుదిద్దుకోనున్న రాముడు, సీత విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. నేపాల్‌లోని మగది, ముస్తాంగ్ జిల్లాల్లో ప్రవహించే కాళీ గండకీ నది పరిసర ప్రాంతాల్లో మాత్రమే సాలిగ్రామ శిలలు లభిస్తాయి. ఆ రాళ్లను నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి ప్రత్యేక హెవీ డ్యూటీ ట్రక్కుల్లో అయోధ్యకు తెప్పించారు.
బుధవారం రోజున ఆ సాలగ్రామ రాళ్లు గోరఖ్‌పూర్‌కు చేరుకున్నాయి. అక్కడ కూడా పూజలు నిర్వహించారు. గండకీ నది .. దామోదర్ కుండ్ నుంచి ఉద్భవిస్తుంది. దానేశ్వర్ దామ్ గండకీకి 85 కిలోమీటర్ల దూరంలో ఆ నది జన్మస్థలం ఉంది. ఈ రెండు బండరాళ్లను అక్కడ నుంచే తీసుకువచ్చారు. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 6వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఉన్న శిలలకు కోట్లాది ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
రెండు రాళ్లలో ఒకటి 30 టన్నులు, మరొకటి 15 టన్నుల వరకు బరువు ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. సీతమ్మవారు పుట్టిన జానకీపూర్ నుంచే అయోధ్య ఆలయానికి రాముడు పట్టుకునే విల్లును పంపనున్నట్లు నేపాలీ నేత బీమలేంద్ర నిధి తెలిపారు.