మందు బాబులు గమనించగలరు..హైదరాబాద్ లో రెండు రోజులపాటు వైన్స్ షాప్స్ బంద్

మందు బాబులు దేనినైనా తట్టుకుంటారు కానీ వైన్ షాప్స్ బంద్ అంటే అస్సలు తట్టుకోలేరు. రేపు బంద్ అంటే ఈరోజే వారికీ కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటారు. అలాంటి మందు బాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోపక్క శ్రీరామనవమి శోభాయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రను హైదరాబాద్‌, భైంసాలో పోలీసుల మార్గదర్శకాల మేరకు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రేపు ఉదయం 11గంటలకు మంగళ్ హాట్​లోని సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. బోయగూడ కమాన్, పురానాపూల్, జూమెరాత్ బజార్, చుడి బజార్, బేగంబజార్ చత్రి, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది.