మరో సారి దుశ్చర్యకు పాల్పడిన ట్విటర్‌

కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా చూపుతూ మ్యాప్

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే నూత‌న ఐటీ నిబంధ‌న‌ల అమ‌లులో కేంద్ర ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ‌కు దిగిన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ దేశ సార్వ‌భౌమ‌త్వం ప‌ట్ల ధిక్కార స్వ‌రం వినిపిస్తున్న‌ది. తాజాగా భారతదేశంలోని భూభాగాలను తప్పుగా చూపింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మ‌కశ్మీర్, లడ‌ఖ్‌ల‌ను వేరే దేశంగా చూపి, భార‌త రాజ‌కీయ చిత్ర ప‌టాన్ని వక్రీకరించింది. గతంలో ట్విట్టర్ లేహ్ ను చైనాకు చెందిన భూభాగం అని చూపించడం తెలిసిందే.

తాజాగా కశ్మీర్ ను దేశంగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్ ను ట్విట్టర్ లోని ట్వీప్ లైఫ్ విభాగంలో పొందుపరిచారు. ఈ అంశంపై నెటిజన్లు ట్విట్టర్ ను ఏకిపారేస్తున్నారు.  అయితే, ఈసారి ట్విట్టర్ తీరుపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం తీవ్రస్థాయిలో స్పందించే అవకాశాలున్నాయి.

కాగా, కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన విషయం తెలిసిందే. 

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/