ట్విట్టర్​ కు నోటీసులు జారీ

నోటీసులిచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ: నూతన ఐటీ నిబంధనల అమలుపై ట్విట్టర్ కు మరోసారి నోటీసులు అందాయి. తాజాగా సమాచార సాంకేతిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. ట్విట్టర్ కు నోటీసులిచ్చింది. ఈ నెల 18న సాయంత్రం 4 గంటల లోపు పార్లమెంటుకు వచ్చి ఐటీ చట్టం అమలుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. ఆన్ లైన్ వార్తలు, సోషల్ మీడియా దుర్వినియోగ కట్టడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది.

ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీకి సంబంధించి పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళా భద్రతపై తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చేందుకు ట్విట్టర్ ప్రతినిధులు పానెల్ ముందు హాజరు కావాల్సిందిగా పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ట్విట్టర్ కు పలు మార్లు నోటీసులిచ్చినా సంస్థ నుంచి సరైన స్పందన రాలేదని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలోని సైబర్ లా గ్రూప్ సమన్వయకర్త రాకేశ్ మహేశ్వరి తెలిపారు. కాగా, ఇంతకుముందు ఐటీ రూల్స్ అమలుపై ట్విట్టర్ కు కేంద్రం నోటీసులిచ్చింది. ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/