జమ్ము కశ్మీర్​లో వరుస పేలుళ్లు

జమ్ము కశ్మీర్‌లోని ఉదంపుర్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. 8 గంటల వ్యవధిలో ఒకేచోట రెండు పేలుళ్లు సంభవించాయి. సాధారణంగా కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్‌ల ఘటనలు తరచూ వార్తల్లో చూస్తుంటాం. ఐతే ఈసారి బస్సుల్లో బాంబులు పేలడం చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న ఓ బస్సులో పేలుడు సంభవించింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్‌బంక్‌లోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే ఉదంపుర్​లోని మరో బస్సులో పేలుడు సంభవించింది.

ఉదయం ఆరు గంటల సమయంలో బస్టాండ్​లో ఉన్న ఓ బస్సులో పేలుడు జరిగింది. ఉదంపుర్ నుంచి రామ్​నగర్​కు ఈ బస్సు వెళ్లాల్సి ఉండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే, బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఇవి రెండు ప్రమాదాలు కావని, పేలుళ్లే అని పోలీసులు నిర్ధరించారు. ఏ రకమైన బాంబులను ఉపయోగించారనే విషయం తెలియాల్సి ఉందని డీఐజీ సులేమాన్ చౌదరి తెలిపారు. అయితే, వరుస పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.