జోడో యాత్ర లో రాహుల్ తో కలిసి నడిచిన మహాత్మాగాంధీ మనవడు

కాంగ్రెస్ నేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రతి చోట కూడా ప్రజలు రాహుల్ కు బ్రహ్మ రథంపడుతున్నారు. రాహుల్ సైతం ఎంతో ఉత్సాహంగా పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను ఎంతో మంది ప్రముఖులు కలుస్తున్నారు.

ఈరోజు యాత్ర బుల్దానా జిల్లాలోని షెగావ్ కి చేరుకోగానే రాహుల్ ను మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కలిశారు. ఆయనతో కలిసి నడిచారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ… రాహుల్ యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం చరిత్రాత్మకమని తెలిపింది. గాంధీ, నెహ్రూల ముని మనవళ్లు కలిసి నడవడం అద్భుతమని తెలిపింది. వీరిద్దరూ ఇద్దరు దివంగత నాయకుల వారసత్వాన్ని కొనసాగించే మహోన్నత వ్యక్తులుగా అభివర్ణించింది.

రేపటితో మహారాష్ట్రలో యాత్ర ముగియనునుంది. ఈనెల 20న మధ్యప్రదేశ్ లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఈనెల 7న తెలంగాణ నుండి మహారాష్ట్రకు ఎంటర్ అయిన భారత్ జోడో యాత్ర నాందేడ్ నుండి హింగోలి, వాషీమ్ జిలాల్లను కవర్ చేసింది. రేపు నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు భారత్ జోడో యాత్ర లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి మహిళలు మాత్రమే నడుస్తారని పార్టీ సినియర్ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.