ఇవెక్కడి అమెరికన్‌ ఎన్నికలు?

‘తుర్లపాటి’ వ్యాఖ్య- ప్రతి సోమవారం

Biden-Trump
Biden-Trump

ప్రజాస్వామ్యమంటే ‘నీ కంటే నాకు ఒక్క ఓటు ఎక్కువ వస్తే నేను గెలిచినట్టు! కాని, మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరును చదివిన సామాన్యుడికెవరికైనా అవి అర్థమైనాయా?

బ్రిటన్‌లో జరిగే ఎన్నికలు ఎప్పుడైనా ఇంత గందరగోళం, అర్థంపర్థం లేని పరిస్థితి సృష్టించాయా? ఈ వ్యాసం పూర్తయే సరికి గెలిచిన వాడు ఓడుతాడో? ఓడినవాడు గెలుస్తాడో తెలియదు.

బైడెన్‌కు 264 ఓట్లు వచ్చాయిట!

ట్రంప్‌నకు 214 ఓట్లు వచ్చాయిట! మరి, ఎవరు గెలిచినట్టు? మరో ఆరు ఓట్లు వస్తే బైడెన్‌ గెలుస్తాడు! ఇక, ట్రంప్‌ గెలవాలంటే-56 ఓట్లు రావాలి!

కాని, అలా ఎందుకు? అంత తేడా వున్న బైడెన్‌ గెలిచినట్టు కాదా? 1780లో రూపొందించిన అమెరికన్‌ రాజ్యాంగంలో ఇంత గందరగోళమున్నదా? అప్పుడు కొన్ని పరిస్థితులలో ఓడిపోయిన ట్రంపే గెలవవచ్చునేమో! 1776లో అమెరికా బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్నది.

ఆ స్వాతంత్య్ర ప్రకటనను రచించింది థామస్‌ జెఫర్‌సన్‌. అమెరికా రాజ్యాంగాన్ని రచించింది కూడా ఆయనే! తరువాత ఆయనకు అధ్యక్షుడు జార్జివాషింగ్టన్‌ ఫ్రాన్స్‌లో అమెరికా రాయబారిగా నియమించాడు.

అమెరికా రాజ్యాంగాన్ని ఆయన ఇంత అధ్వానంగా రూపొందించాడా?
బైడెన్‌కు, ట్రంప్‌కు 264,214 కోట్లు వచ్చాయి. సాధారణ పరిస్థితులలో అయితే, అత్యధిక ఓట్ల మెజారిటీతో -50 ఓట్ల మెజారిటీతో బైడెన్‌ గెలిచినట్టు ప్రకటించాలి.

ఇది సాధారణ ప్రజాస్వామ్య సూత్రం. కాని, ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి గందరగోళం? తలపగలగొట్టుకున్నా ఈ ఎన్నికల పరిస్థితి సామాన్యుడికి అర్థం అవ్ఞతుందా? అయినప్పుడు, ఇది ప్రజాసామ్యం ఎలా అవుతుంది?


ఏ దేశంలోనైనా ఇలాంటి ఎన్నికల పరిస్థితి చూశామా? పైగా, సాధారణ ఓట్లు కూడా బైడెన్‌కే అత్యధికంగా వచ్చాయిట! మరి, ఆయన అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచినట్టే కదా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నాకు 1948 నుంచి తెలుసు.

అప్పుడు డెమొక్రాటిక్‌ ట్రూమన్‌కు రిపబ్లికన్‌ థామస్‌ ఎడ్మండ్‌ డ్యూయీకి జరిగాయి. నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్డ్‌ స్థానంలో జరిగాయి.

కాని, ఎప్పుడూ ఇంత గందరగోళంగా, ఇంత అస్తవ్యస్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగలేదు! అమెరికా రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు సూచించడం లేదా? మరీ ఇంత గందరగోళమా?

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/