టర్కీ లో మరోసారి భూకంపం..

టర్కీ లో వరుస భూకంపాలు ఆగడం లేదు. ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం మూలంగా దాదాపు 40 వేల మంది మరణించగా..వేలాదిమంది గాయపడ్డారు. ఇలా భవనాల సంగతి ఎంత చెప్పిన తక్కువే. ఎక్కడిక్కడే కూలిపోయాయి. ఈ రెండు దేశాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారు ఇంకా సజీవంగా బయటపడుతూనే ఉన్నారు. ఈ భారీ భూకంపం గురించి ఇంకా ప్రజలు మాట్లాడుకుంటూ వణికిపోతుండగానే, తాజాగా, గత రాత్రి పొద్దుపోయాక మరో భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

దేశ దక్షిణ ప్రాంతమైన హటే ప్రావిన్సులో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. గత భూకంపం కారణంగా బీటలు వారిన భవనాలు ఇప్పుడు కుప్పకూలాయి. ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని ప్రకారం.. టర్కీ, సిరియాల్లో భూకంపానికి కారణమైన రెండు ప్లేట్లు క్షితిజ సమాంతరంగా జారడంతో సిరియాతో పోలిస్తే టర్కీ ఆరు మీటర్ల మేర జారిపోయింది. అలాగే, అనాటోలియన్ ప్లేట్.. అరబికా ప్లేట్‌కు సంబంధించి నైరుతి దిశగా కదలడం వల్ల ఈ భూకంపం సంభవించినట్టు ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని తెలిపారు.