కాకరేపుతున్న తుమ్మల వ్యాఖ్యలు

తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతున్నాయి. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని తెలిపిన తుమ్మల… కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కావొద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చ నడుస్తోంది.
పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పర్యటనలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడంటూ కొందరు కార్యకర్తలు ఆయన్ని ప్రశ్నించగా.. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు, సిద్ధంగా ఉండాలంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం టీఆర్‌ఎస్‌లో చాలాకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. తుమ్మల క్రియాశీలక రాజకీయాలతో పాటు టీఆర్‌ఎస్ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పాలేరు నుంచే బరిలో దిగాలని భావిస్తున్నారు. అందుకే మళ్లీ క్రియాశీలకంగా మారారు.
ఇప్పటికే 2018లో మాదిరిగానే ఈ దఫా కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారని విపక్షాలు చెబుతుండగా… టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చంటూ తుమ్మల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.