మాజీ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాల రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. సోమవారం అశ్వారావుపేటలో ఎమ్మెల్సీ తాత మధు అభినంధన సభలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసారు.

‘‘కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు పన్నీ పార్టీని నాశనం చేద్దామని చూశారు. అయినా మీ అందరూ పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీ తాత మధుని గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చిన సందర్భంలో అశ్వారావుపేట అభివృద్ధి విషయంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వేశా. భారతదేశంలో ఫామ్ ఆయిల్ హబ్‌గా అశ్వారావుపేట దమ్మపేట మండలాలు ఉండబోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. భవిష్యత్‌లో కూడా అందరం కలిసి ప్రయాణం చేయాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఇక కొద్దీ రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు తెరాస ను వీడబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కొద్దికాలంగా ఆయన సైలెంట్‌ అయిపోవడంతో టీఆర్ఎస్‌ పార్టీని వీడనున్నారని సాగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు తుమ్మల. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావంతో తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1983లో సత్తుపల్లి నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి జలగం ప్రసాదరావు చేతిలో ఓటమి చెందారు. నాదెండ్ల ఎపిసోడ్ అనంతరం జరిగిన 1985 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో పాత ప్రత్యర్థిపై మరోమారు ఓడిపోయారు.

తెలుగుదేశంలో కీలక నేతగా ఎదిగిన తుమ్మల 1994, 99 ఎన్నికల్లో విజయం సాధించారు. చంద్రబాబు క్యాబినెట్‌లో కీలక శాఖలకు మంత్రిగా కొనసాగారు. వైఎస్ ప్రభంజనంతో 2004లో ఓటమి చవిచూశారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన జిల్లా కేంద్ర ఖమ్మం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై పోటీ చేసి ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం 2014 డిసెంబర్‌లో తుమ్మల కేసీఆర్ పిలుపుతో టీఆర్‌ఎస్‌లో చేరి ఏకంగా మంత్రి అయ్యారు. కొద్దికాలం ఎమ్మెల్సీగా ఉన్నారు. పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ క్యాబినెట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రితో సహా పలు శాఖలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల ఓడిపోయారు.