కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ ధర్మకర్తల మండలి

శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచనున్న టీటీడీ
ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం

తిరుమల : తిరుమల అన్నమయ్య భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం, ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల కిందట నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న ప్రతిపాదనకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్టు వివరించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉన్న ఆర్జిత సేవల ధరలు పాతికేళ్ల కిందట నిర్ణయించినవని వెల్లడించారు. కాగా, నేటి సమావేశంలో సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవ టికెట్ల ధరల పెంపుపై చర్చ జరిగింది. సేవా టికెట్ల ధర పెంపుపై ధర్మకర్తల మండలి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సామాన్య భక్తుల దర్శనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలను పెంచబోమని స్పష్టం చేశారు. సిఫార్సు లేఖలు తగ్గితే సామాన్య భక్తులకు పెద్దపీట వేయొచ్చన్నారు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి.

ఇక నుంచి తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని నిర్ణయించింది. ప్రైవేటు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తొలగించి, భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకోనుంది. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం అందించేందుకు బోర్డు నిర్ణయించిందని తెలిపారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. తిరుమలలో భోజనాన్ని భక్తులు డబ్బుతో కొనుగోలు చేయొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయం ఒక్కటే కాదు. త్వరలోనే సర్వదర్వనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. కరోనా కు ముందున్న పరిస్థితిని తిరుమలలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు టీడీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి. 2022-2023 వార్షిక బడ్జెట్‌ను 3096 కోట్ల రూపాయలతో బోర్డు ఆమోదం తెలిపింది. అన్నమయ్య నడక మార్గాన్ని భక్తులు నడిచేందుకు అనువుగా మర్చాలని నిర్ణయించింది. తిరుపతిలో పద్మావతి చిన్ని పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 230 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే చిన్ని పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/