నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపిన టిఎస్ ఆర్టీసీ

ఇప్పటికే ఎన్నో ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటూ వస్తున్న టిఎస్ ఆర్టీసీ.. ఇప్పుడు నగరవాసులకు తీపి కబురు తెలిపింది. ముఖ్యంగా సమయానికి ఆఫీస్ కు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త మార్గాల్లో బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపింది. దిల్‌సుఖ్ నగర్ నుంచి కోకాపేట్ సెజ్ వరకూ సర్వీసులను నడిపిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

156K రూటులో ప్రయాణికుల సౌకర్యార్ధం దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోకాపేట సెజ్ వరకూ 4 నూతన మెట్రో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోఠి, నాంపల్లి, మెహదీపట్నం, లంగర్ హౌస్, బండ్లగూడ, తారామతిపేట, నార్సింగి మీదుగా కోకాపేట వరకూ ఈ సర్వీస్ నడవబోతుంది. ప్రతి నలభై నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉదయం 6:00 గంటలకు మొదటి బస్సు, రాత్రి 8:40కి చివరి బస్సు ఉంటుందని తెలిపారు. కోకాపేట నుంచి మొదటి బస్సు ఉదయం 7:25 కు, చివరి బస్సు రాత్రి 10:07కు ఉంటుందని తెలిపారు. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.