అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను పెంచిన టీఎస్ ఆర్టీసీ

tsrtc buses
tsrtc buses

ప్రయాణికులపై టీఎస్ ఆర్టీసీ చార్జీల బాదుడు ఆపడం లేదు. ఇప్పటికే పలు రకాలుగా టికెట్ ధరలను పెంచిన టీఎస్ ఆర్టీసీ..ఇప్పుడు అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను మరింతగా పెంచి ప్రయాణికులు జేబులు ఖాళీ చేస్తుంది. ఇటీవలే టికెట్​ ఛార్జీలను ఆర్టీసీ పెంచిన విషయం తెలిసిందే. టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులు కొత్త ఛార్జీలను చూసి వామ్మో అంటున్నారు. ఇక ఇప్పుడు అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను పెంచేసింది. గతంలో రూ.20 ఉండగా మరో రూ.10 పెంచింది. ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

గత కొద్దీ రోజులుగా చమురు సంస్థలు పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా పెంచుతూ వస్తుండడం ఆ ఎఫెక్ట్ ప్రతిదీ దానిపై పడుతుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీ..ఇప్పుడు పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా మరింత నష్టాల్లోకి వెళ్లింది . ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయాణికులపై భారం మోపక తప్పడం లేదని ఆర్టీసీ అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే డీజిల్‌ సెస్‌ ఛార్జీల పేరుతో బస్సు ఛార్జీలను పెంచడం జరిగింది. పల్లెవెలుగు, సిటీ, ఆర్డినరీ సర్వీసులకు డీజిల్ సెస్ కింద రూ. 2 చొప్పున, ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులకు రూ. 5 పెంచారు. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్‌ ధరను రూ. 10 గా పెంచడం జరిగింది.