వంసత పంచమి సందర్భంగా భక్తులకు తీపి కబురు తెలిపిన TSRTC

వంసత పంచమి సందర్భంగా భక్తులకు తీపి కబురు తెలిపింది టిఎస్ ఆర్టీసీ. ప్రతి పండగొచ్చినా..పబ్బమొచ్చినా సరే టిఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందజేస్తూ వస్తుంటుంది. ఇక ఇప్పుడు వసంత పంచమి సందర్భంగా తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు తీపి కబురు అందజేసింది. ఈనెల 26న పలు జిల్లాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం మెుత్తం 108 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. నిర్మల్‌ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ నుంచి 21 బస్సులు, జేబీఎస్‌ నుంచి 12, నిజామాబాద్‌ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్‌ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును నడపనున్నట్లు తెలిపింది.

అలాగే మెదక్ జిల్లాలోని వర్గల్‌ సరస్వతీ ఆలయానికి సికింద్రాబాద్‌ గురుద్వారా నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్‌ గురుద్వారా నుంచి 10, జేబీఎస్‌ నుంచి 6, గజ్వేల్‌ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇక రీసెంట్ గా సంక్రాంతి సందర్బంగా టిఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వందలాది బస్ సర్వీస్ లను అందుబాటులో ఉంచడం..ప్రత్యేక బస్సుల్లోనూ ఎలాంటి అదనపు ఛార్జి లు వసూళ్లు చేయకపోవడం తో ప్రతి ఒక్కరు ఆర్టీసీ వైపే మొగ్గు చూపించారు. దీంతో ఆర్టీసీకి భారీ లాభాలు వచ్చాయి. ఈ పండుగ సీజ‌న్‌లో టీఎస్ ఆర్టీసీకి రూ. 165.46 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు.

గ‌త ఏడాది క‌న్నా రూ. 62.29 కోట్ల ఆదాయం అద‌నంగా వచ్చిందని, 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణించిన‌ట్లు తెలిపారు. కేవ‌లం జ‌న‌వ‌రి 11 నుంచి 14 తేదీల్లో అంటే నాలుగు రోజుల్లోనే 1.21 కోట్ల మంది ప్ర‌యాణికులు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్రయాణించారని , గ‌తేడాదితో పోల్చితే ఆ నాలుగు రోజుల్లోనే 5 ల‌క్ష‌ల మంది అధికంగా ప్రయాణించినట్లు సజ్జనార్ తెలిపారు. ఇదంతా పోలీసులు, ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ అధికారులు, టీఎస్ ఆర్టీసీ సిబ్బంది వ‌ల్లే సాధ్య‌మైంద‌ని చెపుతూ వారిని అభినందించారు.