తెలంగాణలో విద్యుత్ , ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఫై విద్యుత్ చార్జీల భారంతో పాటు ఆర్టీసీ చార్జీల భారం పడబోతోంది. ఈ రెండు సంస్థలు భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని, వాటిని లాభాల్లోకి తీసుకరావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల సమస్యలపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రధానంగా చర్చించారు.

కరోనా దెబ్బకుతోడు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ఈ సందర్భంగా సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల రూ.550 కోట్లు, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరలు పెరగడం వల్ల రూ. 50 కోట్లు కలిసి ఏడాదికి దాదాపు రూ. 600 కోట్ల మేర భారం పడుతోందని, కాబట్టి ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిందేనని మంత్రులు అజయ్ కుమార్, జగదీశ్‌రెడ్డి, సజ్జనార్, ప్రభాకర్‌రావు తదితరులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 2020 మార్చిలోనే ఆర్టీసీ ఛార్జీలను పెంచుతామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. కరోనా కారణంగా పెంచలేదు. ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్టీసీని పటిష్ఠపరిచేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంపై… ఇంకా మీద భారం మోపమనడానికి మాటలు రావడంలేదు. ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతిస్తే తప్ప మనుగడ సాధ్యం కాదని’ పువ్వాడ అజయ్‌, సజ్జనార్‌ సీఎంకు తెలిపారు. ఈ నేపథ్యంలో బస్సు ఛార్జీలు 10 నుంచి 20 శాతం పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇక విద్యుత్ చార్జీలు కూడా ఆరేళ్లుగా సవరించలేదని… విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి ఇప్పుడు పెంచక తప్పదన్నారు. మొత్తం మీద మరికొద్ది రోజుల్లో ఆర్టీసీ , విద్యుత్ చార్జీలు మోతమోగనున్నాయి.