TSPSC పేపర్ లీక్ : రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నిరసనలు

TSPSC పేపర్ లీక్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నారు. నేడు పేపర్ లీక్ ఘటన ఫై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాలో బిజెపి శ్రేణులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పలు కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

పేపర్ లీకేజ్ ఘటనకు..సీఎం కేసీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలన్నారు. రద్దు చేసిన పరీక్షలను ఆలస్యం చేయకుండా వెంటనే నిర్వహించాలని, నియంత ప్రభుత్వాన్ని కూల్చేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో పోటీ పరీక్షలపై విద్యార్థులకు విశ్వాసం పోయిందన్నారు. పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. మరోపక్క రేపు టీ కాంగ్రెస్ సైతం పేపర్ లీక్ ఘటన ఫై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు పిలుపునిచ్చింది.