తెలంగాణ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు

TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి జూన్ 11న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఈ రెండు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పేపర్ లీకేజీ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వివరించింది.

గతేడాది సెప్టెంబర్ 16న గ్రూప్ -1 ప్రిలిమ్స్, ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించడం జరిగింది. పేపర్ లీకేజ్ కేసులో నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో వేర్వేరు ప్రశ్నాపత్రాలను గుర్తించారు దర్యాప్తు అధికారులు. కాగా, ప్రవీణ్.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ నుంచి నాలుగు ఎగ్జామ్ పేపర్లను కాపీ చేసుకున్నట్లు గుర్తించారు. రానున్న 3, 4 నెలల్లో 20కి పైగా టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ తరుణంలో పేపర్లు లీక్ అవడంతో.. అన్ని ప్రశ్న పత్రాలను మార్చాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది.