నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తో టీఎస్ మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీలో ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రుల బృందం భేటీ కానుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం పీయూష్ గోయ‌ల్ తో సమావేశమై ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించనున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం రెండు రోజులుగా నిరీక్షిస్తున్నది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు పార్లమెంట్‌లో సోమవారం మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. కలిసేందుకు మంత్రులు, ఎంపీల బృందం నిరీక్షిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు కలిసేందుకు మంత్రి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని ఎంపీలు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/