మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌ః అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ పీపుల్స్‌ప్లాజాలో సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 138 మంది మహిళా జర్నలిస్టులకు మంత్రులు కెటిఆర్, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సీఎస్ శాంతికుమారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. మహిళలకు ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ ఉత్సవాలు జరుపుకునే రోజులు రావాలని ఆకాంక్షించారు. మహిళలను, అమ్మాయిలను గౌరవించే సంస్కారం అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే నేర్పాలని తల్లిదండ్రులకు సూ చించారు. సమాజంలో మహిళలపై జరిగే దాడులు, అకృత్యాలను పిల్లల పెంపంకంలోని లోటుపాట్లు కూడా ప్రభావితం చేస్తాయని చెప్పారు.
రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల కోసం వీ-హబ్ ద్వారా ఉమెన్ ఇన్ జర్నలిజం లీడర్‌షిప్ ఆక్సిలరేటెడ్ ప్రోగ్రాం-2023 నిర్వహిస్తామని ప్రకటించారు. ఇలాం టి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అని, రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో కొత్తగా జర్నలిజంలోకి రావాలనుకుంటున్న ఔత్సాహికులు కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో లోటుపాట్లు రాయడానికే పరిమితం కాకుండా సంక్షేమ పథకాల విజయాలను కూడా ప్రసారం చేయాలని కోరారు.