‘పక్కా ప్లాన్ తో నాపై తప్పుడు ప్రచారం’


ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి
కెసిఆర్ సర్కారుకు ‘ఈటల’ సవాల్

TS Minister Etela Rajender-
TS Minister Etela Rajender-

Hyderabad: మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలపై శుక్రవారం సాయంత్రం ఆయన వివరణ ఇచ్చారు.

ఏ భూమిని కబ్జా చేయలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన రాజకీయ చరిత్ర, ఆస్తులపై విచారణ జరిపించుకోవాలని మంత్రి ఈటెల ప్రభుత్వానికి సవాలు విసిరారు. తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు.

తన ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తానే డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. తాను ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని , చిల్లర రాజకీయాలకు ఈటల లొంగిపోడన్నారు.

2016లో జమున హెచరీస్ కోసం ఎకరం రూ.6 లక్షల చొప్పున 40 ఎకరాల భూమిని ఒకేసారి కొన్నామని మంత్రి చెప్పారు. కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణంగా తీసుకున్నట్లు ఈటల తెలిపారు. తాను తీసుకున్న భూముల చుట్టూ అసైన్డ్ భూములున్న విషయాన్ని సీఎంకు కూడా చెప్పానని, ఆ భూములన్నీ ఇప్పటికీ వాళ్ల దగ్గరే ఉన్నాయని చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్, విజిలెన్స్ డీజీతోనే కాకుండా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి మంత్రి ఈటల సవాల్ విసిరారు. తాను దొరనని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని., నీచమైన ప్రచారం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. తాను ముదిరాజ్ బిడ్డనని, తన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని.. తన కొడుకు పేరు నితిన్ అని, తన భార్య నితిన్ రెడ్డి అని పేరు పెట్టుకుందని..’ దొర పెత్తనాలకు, అణచివేతలకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తిని’ అని అన్నారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/