ఇప్పుడు హైకోర్టుకు రావ‌డం ఏంట‌న్న హైకోర్టు

తెలంగాణలో పరీక్షలు వాయిదా వేయాలంటూ పిటిష‌న్.. ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తిర‌స్క‌రించిన హైకోర్టు

హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలంటూ పిటీషన్ దాఖలైంది. అయితే, దీనిపై స్పందించిన హైకోర్టు పరీక్షల అంశాన్ని అత్యవసర విచారణకు నిరాకరిస్తున్న‌ట్లు తెలిపింది. ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని ఇప్పుడు హైకోర్టుకు రావ‌డం ఏంట‌ని, ఇన్ని రోజులు ఏం చేశార‌ని నిల‌దీసింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయ‌ని, ఇకపై దీనిపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. లంచ్‌మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వ‌బోమ‌ని చెప్పింది

కాగా, అంతకు ముందు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు.. ఆందోళనకు దిగారు. మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/