మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు జారీ
సాయి గణేశ్ ఆత్మహత్యలో నోటీసులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ నోటీసులు జారీ

హైదరాబాద్ : ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య వ్యవహారంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పువ్వాడ అజయ్‌తో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఆ నోటీసులకు స్పందించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
అధికార టీఆర్ఎస్ నేతల ప్రోత్సాహంతో పోలీసులు తనపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని చెబుతూ సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి గణేశ్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను వెలికితీయడంతో పాటు అందుకు బాధ్యులెవరనే విషయంపైనా నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/