గవర్నర్ ఫై హైకోర్టు లో వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకున్న తెలంగాణ సర్కార్

రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంత వరకు ఆమోదించలేదంటూ తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. అయితే పిటిషన్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి, పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ ధవే కోర్టుకు తెలిపారు.

గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. గవర్నర్ ను విమర్శించొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 3న సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుమతి కోరుతూ ఈ నెల 21న గవర్నర్ కు లేఖను పంపించింది. అయితే రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి రిటర్న్ లేఖ వెళ్లింది.

శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టేముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని… దానికి సంబంధించిన కాపీని తమకు పంపించారా, లేదా అని రాజ్ భవన్ ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో… గవర్నర్ కూడా ఆమోదం తెలపకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలకు సమయం దగ్గర పడటంతో ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది. దీంతో, హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా పిటిషన్ ను ఉపసంహరించుకుంది.