సిట్ చేతికి TSPSC పేపర్ లీక్ కేసు

TSPSC నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల పరీక్ష పేపర్లు లీకైనట్టు వెల్లడైంది. అటు, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రాన్ని కూడా ప్రవీణ్ బృందం లీక్ చేసినట్టు గుర్తించారు.

ఈ నేపథ్యంలో, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో దర్యాప్తు బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం సీసీఎస్ పోలీసులకు అప్పగించింది. అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టు ఈ నెల 13న ఫిర్యాదు నమోదైందని, సెక్షన్ 409, 420, 120(బి)తో పాటు ఐటీ చట్టంలోని 66సి, 66బి, 70 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు వెల్లడించింది. ఈ కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు 8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, మరో నిందితురాలు రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.

ఇక ఈ పేపర్ లీక్ ఘటన ఫై ప్రతిపక్షపార్టీ లు రాష్ట్ర ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు. బండి సంజయ్ దీనిపై స్పందిస్తూ.,.టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్షలన్నీ లీక్ అని వ్యాఖ్యానించారు. గ్రూప్-1 ప్రశ్నాపత్రం కూడా లీకైందని అన్నారు. తాజా ప్రశ్నాపత్రాల లీకేజి ఘటనలో నిందితుడు ప్రవీణ్ గతంలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ఓ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాగా, అతడి ఓఎంఆర్ షీటును కూడా బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ మండిపడ్డారు. రాబోయే రెండు మూడు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించి కేసీఆర్ టీమ్ కు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వలేక దారుణాలకు ఒడిగడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనక పెద్దల హస్తం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పేపర్ లీకేజీ లో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో పలు పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.