సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.75 కోట్లు విడుదల

వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర

హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద రెండో జాతర అయిన మేడారం (సమ్మక్క సారలమ్మ) జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు. వాస్తవానికి ఇది గిరిజనుల జాతర అయినప్పటికీ వారికంటే ఎక్కువ సంఖ్యలో గిరిజనేతరులు జాతరకు హాజరవుతుంటారు. ఎంతో భక్తితో అమ్మవార్లను కొలుచుకుంటారు. ఈ నేపథ్యంలో జాతరను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది. జాతర నిర్వహణ కోసం రూ. 75 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలు, వారి ఆచారాలు, పండుగల పట్ల ముఖ్యమంత్రికి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు, కమ్యూనిటీ డైనింగ్ హాలు, ఓహెచ్ఆర్ఎస్ నిర్మాణ పనులకు రూ. 2.24 కోట్ల వ్యయంతో గత వారమే శంకుస్థాపన చేశామని చెప్పారు. మిగిలిన పనులన్నింటినీ డిసెంబర్ చివరిలోగా పూర్తి చేస్తామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/