తెలంగాణ లో రేషన్ బియ్యం కావాలంటే కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే..

కరోనా మహమ్మారి మళ్లీ బుసలుకొడుతుంది. తగ్గినట్లే తగ్గి ఇప్పుడు ఓమిక్రాన్ గా మళ్లీ దాడి చేసేందుకు వస్తుంది. ఇప్పటికే దేశంలో ఈ కొత్త ఓమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. దీంతో అన్ని రాష్ట్రాలు ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ట్రై చేస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే పలు ఆంక్షలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రతినెలా ఇచ్చే రేషన్ బియ్యం కావాలంటే కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే అని తెలిపింది. బియ్యం తీసుకోవడానికి రేషన్ షాపుకు వెళ్లే కుటుంబ సభ్యుడు.. తాను మాత్రం టీకా వేసుకున్నట్లు చూపెడితే సరిపోదు. ఇంట్లో వాళ్లందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని సర్టిఫికెట్లు చూపిస్తేనే బియ్యం ఇస్తున్నారు.

ఒకవేళ ఎవరైనా టీకా తీస్కోకపోతే, అక్కడే టీకా వేయిస్తున్నారు. గత మూడ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లందరూ ఇదే ఫాలో అవుతున్నారు. తమకు పైఅధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, ఆ మేరకే నడుచుకుంటున్నామని రేషన్ డీలర్లు చెబుతున్నారు. అలాగే ఉద్యోగులు వ్యాక్సిన్ వేస్కుంటేనే వచ్చే నెల జీతం జమ చేస్తామంటూ వివిధ ప్రభుత్వ డిపార్ట్​మెంట్ల హెచ్ఓడీలు ఇంటర్నల్ సర్క్యులర్లు జారీ చేస్తున్నారు. ఎవరైనా ఇతర కారణాల వల్ల వ్యాక్సిన్ వేయించుకోకపోతే, దానికి సంబంధించి డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తేవాలంటున్నారు. ఇక ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేశామని అధికారులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ టైమ్ లో టీకా కోసం జనాలు పరుగులు పెట్టారు. ఆ తర్వాత కేసులు తగ్గడంతో నిర్లక్ష్యం చేశారు. భయంతో కొంతమంది, అవగాహన లేక మరికొంత మంది వ్యాక్సిన్ కు దూరంగా ఉన్నారు. అందుకే ఇలాంటివి చేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు.