భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజించిన రాష్ట్ర సర్కార్

17 ఏళ్లుగా ఉన్న వివాదానికి తెరదించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామాన్ని రెండు పంచాయతీలుగా, ఆసిఫాబాద్‌లో మరొక పంచాయతీని ఏర్పాటు చేసింది.

భద్రాచలం పంచాయతీ పరిధిలో 70 వేల జనాభా ఉండగా 30వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. సారపాక పంచాయతీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 20,164 జనాభా ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 వేలకు చేరుకున్నట్లు ఓ అంచనా. ఓటర్లు 21 వేల మందికి పైగా ఉంటారని సమాచారం.

భద్రాచలం పంచాయతీని భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్ పంచాయతీలుగా విభజించింది. 700.4 ఎకరాల విస్తీర్ణంలో 21 వార్డుల్లో భద్రాచలం పంచాయతీ, 349.77 ఎకరాలు 17 వార్డుల్లో సీతారాం నగర్ పంచాయతీ, 997 ఎకరాలు 17 వార్డుల్లో శాంతినగర్ పంచాయతీని ఏర్పాటు చేసింది. సారపాకలో 1,732 ఎకరాల విస్తీర్ణంలో 17 వార్డుల్లో సారపాక పంచాయతీని, 2,512.18 ఎకరాల విస్తీర్ణంలో 15 వార్డుల్లో ఐటీసీ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసింది.