ఉపాధ్యాయుల ఆస్తుల వివరాల విషయంలో వెనక్కు తగ్గిన తెలంగాణ సర్కార్

ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై ఏటా త‌మ ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని, స్థిర‌, చ‌రాస్తుల‌కు సంబంధించి క్ర‌య విక్ర‌యాల కోసం ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకోవాల‌ని శనివారం ఓ ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఫై ఉపాధ్యాయులతో పాటు రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడం తో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

కేసీఆర్ సర్కారు టీచర్లను లక్ష్యంగా చేసుకుందని విపక్షాలు ఆరోపించాయి. దీంతో విద్యాశాఖ ఆదేశాలను నిలిపేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆస్తుల వివరాలు వెల్లడించడం కొత్త నిబంధనేం కాదని.. 1968 నుంచే అమల్లో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సిఫారసు ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశామని.. వెంటనే ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సర్కారు ప్రకటించింది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ టీచర్ ఆస్తుల విషయంలో గతేడాది ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని విజిలెన్స్ తేల్చింది. దీంతో శాఖపరమైన చర్యలు తీసుకోవాలని.. టీచర్లందరికీ ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది.

అంతకు ముందు ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని , ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఆస్తి వివరాలు సబ్మిట్ చేయాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థిర, చర ఆస్తులు అమ్మినా.. కొన్నా.. ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. విద్యాశాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్ మెంట్ సమర్పించాలని సూచించింది. టీచర్ లకు, ఉద్యోగులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీలు, డీఈవోలకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతే..స్థిర / చర ఆస్తులు కొనుగోలు / అమ్మకాలు చేయాలని ఉద్యోగులను ఆదేశించింది.