ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై..ప్రధాని మోడీతో భేటీ

రాజకీయ పరిస్థితులపై చర్చ?

న్యూఢిల్లీ: గవర్నర్ తమిళిసై ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధానితో ఆయన నివాసంలో ఆమె భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో రాజ్ భవన్ తో సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్, సీఎం కేసీఆర్ కు మధ్య చెడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అంగరంగ వైభవంగా నిర్వహించిన యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించకపోవడం, అంతకుముందు గణతంత్ర దినోత్సవాన్నీ గవర్నర్ లేకుండానే సీఎం నిర్వహించడం, గవర్నర్ రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకూ సీఎం సహా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలూ దూరంగా ఉండడం వంటి కారణాలతో రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం పెరిగిందనేందుకు ఉదాహరణలన్న చర్చ నడుస్తోంది.

ఆమధ్య గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కౌశిక్ రెడ్డి ఫైల్ ను సీఎం కేసీఆర్ గవర్నర్ వద్దకు పంపారు. కానీ, ఆమె ఆ నామినేషన్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అప్పట్నుంచే సీఎం, గవర్నర్ మధ్య పొసగడం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె నిన్న ఢిల్లీకి వెళ్లారు. ప్రధానితో సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు మంత్రులతోనూ ఆమె సమావేశం అవుతారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/