రేపు అమిత్ షాతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై భేటీ ..

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. తెలంగాణ‌ రాష్ట్రంలో జ‌రుగుతున్న మార్పుల గురించి అమిత్ షాతో చ‌ర్చించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ కి వెళ్లడం జరిగింది. రేపు గవర్నర్ ఢిల్లీ పర్యటన తో రాష్ట్రంలో ఉత్కంఠను రేపుతోంది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఇద్దరు హస్తినకు వెళ్లడం ఫై అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ జాత‌ర స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ప్రోటోకాల్ అంశంపై పెద్ద ర‌చ్చ నే చోటు చేసుకుంది. అలాగే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే జరగడం.. యాదగిరి గుట్ట ఆలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించకపోవడం వంటివి కేంద్రం దృష్టికి గ‌వ‌ర్న‌ర్ తీసుకెళ్తారేమో అని అనుకుంటున్నారు.

మరోపక్క వరి కొనుగోలు విషయంలో కేంద్రం – తెరాస ప్రభుత్వం మధ్య వార్ నడుస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల నిరసనలకు దిగారు తెరాస నేతలు. అలాగే ఏప్రిల్ 6న తెలంగాణ‌లోని నాలుగు ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారులు నాగ్‌పూర్‌,ముంబై, బెంగ‌ళూరు, విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారుల‌పై రాస్తారోకో , ఏప్రిల్ 7న 32 జిల్లాకేంద్రాల్లో మంత్రులు, శాస‌న స‌భ్యులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న దీక్ష‌లు , ఏప్రిల్ 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయ‌తీల్లో ప్ర‌తి రైతు త‌న ఇంటిమీద న‌ల్ల‌జెండా ఎగుర‌వేయాల‌ని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం, ఏప్రిల్ 11న చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని తెలుపడం ఇవ్వన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో స‌మావేశం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.