తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసారు. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్‌ 2021 ఎట్టకేలకు పూర్తయి..ఫలితాలు వచ్చాయి. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, ఈనెల 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది హాజరయ్యారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తేసింది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారందరూ ఇంజినీరింగ్ ప్రవేశాలకు అర్హులని సర్కారు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎంసెట్‌) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలెంగ్‌ ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభం కానుంది.

ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.