అంతమాత్రానికే కిమ్‌ చర్చలకు రారు

Donald Trump & Kim Jong-un
Donald Trump & Kim Jong-un

సియోల్‌: ఉత్తర కొరియా చర్చలకు వస్తుందని అమెరికా, దక్షిణ కొరియా కలలు కంటున్నాయని ఉత్తర కొరియా ఎద్దేవా చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కేవలం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన తమ అధ్యక్షుడు కిమ్‌ చర్చలకు రారని తెలిపింది. తమ దేశం యొక్క డిమాండ్లు పూర్తిగా నెరవేరితేనే అగ్రరాజ్యంతో చర్చలు పునరుద్ధరిస్తామని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ సలహాదారు కిమ్‌ కై గ్వాన్‌ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా జాతీయ భద్రతా డైరెక్టర్‌ చంగ్‌ యి యాంగ్‌ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో ట్రంప్‌ భేటీ అయ్యారు. అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేయాలని తనను కోరారని చంగ్‌ యాంగ్‌ తెలిపారు. దీనిపై స్పందిచింన కిమ్‌ కై గ్వాన్‌ ట్రంప్‌ నుంచి తమకు లేఖ అందిందని, ఈ విషయంలో సియోల్‌ తలదూర్చవల్సిన అవసరం లేదని అన్నారు. ఇరు దేశాల సంబంధాల్లో జోక్యం చేసుకుని దక్షిణ కొరియా తన పరిమితులు దాటుతోందని ఆయన దూషించారు. తమ డిమాండ్లు తీరితేనే అమెరికాతో చర్చలకు వస్తామని తేల్చి చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/