సొంత సోషల్ మీడియా సంస్థను తీసుకురాన్ను ట్రంప్‌

వచ్చే నెలలో గ్రాండ్ గా ప్రారంభం

న్యూయార్క్ : ముందు ట్విట్టర్.. ఆ తర్వాత ఫేస్ బుక్.. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను నిర్దాక్షిణ్యంగా తొలగించేశాయి. ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారంటూ ఆ సంస్థలు ఆరోపించాయి. దాంతో ఆ వెంటనే వాటికి దీటుగా సొంతంగా సోషల్ మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా తన సోషల్ మీడియా సంస్థను ఆయన ప్రకటించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) కింద ‘ట్రూత్ సోషల్’ అనే సోషల్ మీడియా సైట్ ను ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

వచ్చే నెలలో అతిరథ మహారథుల సమక్షంలో సోషల్ మీడియా సైట్, యాప్ ను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే యాపిల్ యాప్ స్టోర్ లో ముందస్తు డౌన్ లోడ్ చేసుకునేందుకు యాప్ ను అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. దీంతో పాటు వీడియో ఆన్ డిమాండ్ సర్వీసునూ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. స్కాట్ సెయింట్ జాన్ అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సారథ్యంలో ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లను దీని ద్వారా అందించనున్నారు.

పెద్ద టెక్ సంస్థల నిరంకుశ పోకడలను ఎదిరించేందుకు టీఎంటీజీ, ట్రూత్ సోషల్ ను ఏర్పాటు చేశానని ట్రంప్ ప్రకటించారు. ట్విట్టర్ లో తాలిబన్లనూ అనుమతించే ప్రపంచంలో అందరం బతుకుతున్నామని, అయినా కూడా అమెరికా అధ్యక్షుడు సైలెంట్ అయ్యారని, అది ఏ మాత్రమూ ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తేల్చి చెప్పారు. కాగా, పబ్లిక్ లిస్టింగ్ కోసం డిజిటల్ వరల్డ్ ఆక్విజిషన్ కార్ప్ (డీడబ్ల్యూఏసీ) అనే సంస్థతో టీఎంటీజీ పొత్తు పెట్టుకుంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 87.5 కోట్ల డాలర్ల విలువతో సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత సంస్థ విలువను మరో 82.5 కోట్ల డాలర్లకు పెంచుతామని తెలిపారు. మార్కెట్ లో షేర్ విలువను బట్టి సంస్థ విలువ 170 కోట్ల డాలర్ల దాకా ఉంటుందని ప్రకటించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/