ట్రంప్‌పై ఒబామా ఘాటు వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. పలు ర్యాలీల్లో పాల్గొన్న ఇద్దరూ.. ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్నారు. పెన్సిల్వేనియాలో జరిగిన సభలో మాట్లాడిన ఒబామా.. ట్రంప్‌ను క్రేజీ అంకుల్ అంటూ కామెంట్ చేశారు. జాతివివక్షను ట్రంప్ పెంచిపోషించారన్నారు. ఇక నార్త్ కరోలినాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. 2016లో తాను గెలవడానికి ఒబామా ప్రభుత్వ వైఫల్య కారణమే అన్నారు. అయితే అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే ఓటింగ్ మొదలైంది. దాంట్లో ఇప్పటి వరకు 42 మిలియన్ల మంది ఓటేశారు. ఒబామా ఓ నిజాయితీలేని వ్యక్తి అని, గతంలో హిల్లరీకి, ఇప్పుడు బైడెన్ తరపున ప్రచారం చేస్తున్నారని ట్రంప్ విమర్శించారు. గత ఎన్నికల్లో కావాలనే బైడెన్‌ను పక్కనపెట్టి.. హిల్లరీకి ఒబామా ఛాన్స్ ఇచ్చారంటూ ఆరోపించారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ట్రంప్ విఫలమైనట్లు ఒబామా విమర్శించారు. ట్రంప్ అధ్యక్షుడి హోదాలో ఆయనకు మద్దతు ఇవ్వని ప్రతి ఒక్కర్ని మాటలతో అవమానిస్తున్నారని, లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ట్రంప్ సర్వసాధారణ ప్రవర్తన అదే అంటూ ఒబామా ఆరోపించారు. ఓ కుటుంబంలో ఇలాంటి వ్యక్తి ప్రవర్తనను ఎవరూ సహించరన్నారు.కరోనా నుంచి మనల్ని ట్రంప్ రక్షించలేరని, ఆయన ప్రాణాల్ని కూడా ఆయన కాపాడుకోలేరని ఒబామా అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/