వివాదాస్పదమవుతున్న ట్రంప్‌ నిర్ణయాలు

భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం

effect on Indian students
effect on Indian students

పూ ర్తి ఆన్‌లైన్‌ చదువుల విదేశీ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లి బాగుపడాలనే భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతున్నది .

కువైట్‌లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన బయటి దేశాల వారీ సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవ డానికి అక్కడి ప్రభుత్వం ఒక బిల్లును సిద్ధం చేసింది.

అమెరికా నిర్ణయం చదువ్ఞల కోసం అక్కడికి వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకొని బాగుపడాలనుకునే మన విద్యార్థులపై పిడుగుపాటు వంటిది.

వారు కేవలం ఉన్నత ప్రమాణాల విద్యార్జన కోసమే అక్కడికి వెళుతూ ఉంటే ఆ స్థాయి విద్యను అక్కడ కూడా అందించి వారిని మనదేశంలోనే ఉంచుకోవచ్చని సలహా ఇవ్వడం సబబుగానే ఉంటుంది.

అమెరికా ఆర్థికవ్యవస్థ వృద్ధిలో భాగస్వాములై అత్యంత విలువైన డాలర్‌ కరెన్సీని సంపాదించుకోవడం అంతిమ లక్ష్యంగా మన విద్యార్థులు అక్కడికి వెళుతున్నారు.

మన ఆర్థిక వ్యవస్థ దానితో పోటీ పడజాలదు. 2019 విద్యాసంవత్సరంలో రెండు లక్షలకుపైగా భారతీయవిద్యార్థులు అమెరికా వెళ్లారు.

అక్కడ నాణ్యమైన విద్య లభించడంతోపాటు చదువ్ఞకుంటూనే సంపాదించుకునే తెరువ్ఞలు. ఆ తర్వాత మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి.

ముఖ్యంగా వైద్యం. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి భవిష్యత్తు సమకూరుతోంది. అధ్యక్ష ఎన్నికలు అతి చేరువలో ఉన్న తరుణంలో అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాల్లో భాగంగా ట్రంప్‌ విద్యార్థి వీసాలపై ఈ కొత్త ఆంక్షను సంధించాడు.

ఇది తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. దీనిపై న్యాయస్థానాల్లో కేసులు కూడా దాఖలయ్యాయి.

అమెరికాలో చదువ్ఞకుంటున్న విదేశీ విద్యార్థులలో చైనీస్‌ తర్వాత మన వారే ఎక్కువ. గత ఏడాది అమెరికా కళాశాలలో ప్రవేశం పొందిన వారిలో విదేశీయులు 5.5 శాతం ఉన్నారు.

వీరివల్ల అమెరికాకు లభించిన రాబడి 41 బిలియన్‌ డాలర్లు.

ఉన్నత సాంకేతిక విద్యల్లో పట్టభద్రులై అమెరికా వెళుతున్న విదేశీ విద్యార్థుల వల్ల అక్కడి సంస్థలకుఉత్తమ ప్రమాణాల మేధస్సు చకవగా లభిస్తున్నది.

ఆ దేశ సంపదను పెంచడంలో వీరు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు.

కువైట్‌ తలపెట్టిన బిల్లు చట్టమైతే అక్కడ స్థిరపడ్డ కనీసం ఎనిమిది లక్షల మంది భారతీయులు స్వదేశానికి వచ్చేయవలసి వస్తుంది. వీరిలో అత్యధికులు కేరళీయులే. 14 లక్షల 50వేల మంది భారతీయులు అక్కడ స్థిరపడ్డారు.

కువైట్‌ జనాభా 43 లక్షలు కాగా, వారిలో 70 శాతం అంటే 30 లక్షల మంది విదేశీయులే. తమది విదేశీ యుల దేశం అనేఅభిప్రాయాన్ని తొలగించడానికి కువైట్‌ ఈ కొత్త బిల్లును తలపెట్టింది.

దేశీయంగా చూస్తే హర్యానా రాష్ట్రం అక్కడి ప్రైవేట్‌ ఉద్యోగాలలో 75 శాతాన్ని స్థానికులకే కేటాయించడానికి నిర్ణయించింది.

పాలక భాగస్వామ్య పక్షమైన జన నాయక్‌ జనతా పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మేరకు వాగ్దానం చేసి 10 స్థానాలను గెలుచుకుంది.

మహారాష్ట్రలో స్థానికేతరుల బూచీని చూపించి ముఖ్యంగా దక్షిణాది వారిపై కక్షకట్టి ఉద్యమాలు నడిపి శివసేన రాజకీయంగా బాగుపడింది.

ఈ విధంగా అమెరికాసహా అనేక చోట్ల బయటి వారి బహిష్కరణ ధోరణి ప్రబలిపోతున్నది. ఇది భారతదేశానికి అతిపెద్ద సవాలుగా మారుతున్నది.

మొన్న కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లిపోయిన అసంఖ్యాక వలస కార్మికులలో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ వారు అత్యధికులు.

కాగా స్థానికంగా పనిపట్లు కరవైన ఇతర రాష్ట్రాల వారూ ఉన్నారు. పలురకాల చిన్న, పెద్ద వృత్తులు పనులు చేసుకొని బతుకుతున్న బయటి రాష్ట్రాల వారు లెక్కలేనంత మంది.

అదే సమయంలో స్థానికుల్లో నిరుద్యోగులు, ఆధునిక వృత్తినైపుణ్యాలు కొరవడిన వారు కూడా అసంఖ్యాకంగా ఉన్నారు.

దేశంలో ఉన్నత విద్యాప్రమాణాలు దుర్భిణీ వేసి చూసినా కనపడవు.

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు పుట్టగొడుగుల్లా అవతరించినా పరిశ్రమలకు పనికి వచ్చే ఇంజినీర్లు తగిన సంఖ్యలో తయారు కావడం లేదు. అందువల్ల వారిలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది.

యువతకు ప్రాథమికస్థాయి శిక్షణనిచ్చి స్వతంత్రంగా పని చేసి సంపాదించుకొనే సామర్థ్యాన్ని కలిగించేది. ఇప్పుడవి తమ పూర్వపు ఆకర్షణ కోల్పోయాయి.

యువతలో తెల్లచొక్కా మనస్తత్వం. కుర్చీల్లో కూర్చొని పనిచేసే అనాయాస ఉద్యోగాల పట్ల మక్కువ పెరిగిపోయి ఐటిఐలు దెబ్బతిన్నాయి.

అందుచేత దేశంలోని యువతకు పని సంస్కృతిని అలవర్చి, దానిని అపారంగా కలుగచేయాలి. శ్రమకు గౌరవమిచ్చి అందుబాటులోని ఏ పనినైనా చేయడానికి సిద్ధపడేలా వారిని మలచాలి.

సామాజిక హోదాను బట్టి ఉన్నత ఉద్యోగాలే చేయాలనే దృష్టిని పూర్తిగా తొలగించాలి.

  • ప్రభు పులవర్తి, సీనియర్‌ జర్నలిస్టు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/